ప్రాణహిత జనవరి 2009 సంచిక
ప్రాణహిత జనవరి 2009 సంచికకు స్వాగతం!
ప్రాణహిత పాఠకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!
చూస్తుండగానే 2008 వెళ్ళిపోయింది. రక్త సిక్తమైన పాదాలతో మన జీవితాల మీదుగా, చెప్పలేనంత దుఃఖాన్నీ ఎన్నెన్నో మానని గాయాల్నీ మిగిల్చి కర్కశంగా వెళ్ళిపోయింది. ఒక పెద్ద సముద్రపుటల ఊడ్చి వెళ్ళిన తర్వాత మిగిలే విషాదమూ, నిశ్శబ్దమూ మిగిల్చి వెళ్ళి పోయింది. ద్రవ్య పెట్టుబడిపైన ఆధారపడి, ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదం నిర్మించుకున్న పేకమేడలు కుప్పకూలిపోయి అసంఖ్యాక ప్రజానీకం జీవితాల్లో నింపుతున్న చీకటి ఒక వైపు, యుద్ధోన్మాదుల తీరని రక్తదాహం అమాయకుల బతుకుల్ని నెత్తుటేర్లలో ముంచుతున్న క్రూరత్వం మరోవైపు - 2008 సంవత్సరం నిండా విషాద ఛాయల్ని మిగిల్చాయి. ద్రవ్య పెట్టుబడి పతనం, ఆరని ఇరాక్ , ఆఫ్ఘనిస్థాన్ యుద్ధజ్వాలలు, ముంబాయిపై ఉగ్రవాదుల దాడులు – అన్నీ సామ్రాజ్యవాదం తీరని ధన, అధికార, రక్త దాహాల ఫలితాలే అని 2008 మరో మారు నిరూపించింది. మన జీవితాల్లో భయంకరమైన చేదు విషం నింపుతున్నది సామ్రాజ్యవాదం ఎడతెగని విస్తర్ణాకాంక్షే అని 2008 మరోమారు చాటిచెప్పింది. లాటిన్ అమెరికా, మధ్య ప్రాచ్యం, ఆసియా ఆఫ్రికా – ఒకటేమిటి ప్రపంచం నలుమూలలా చెలరేగుతున్న సంక్షోభానికి, పారుతున్న నెత్తురూ కన్నీళ్ళకూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సామ్రాజ్యవాదం కారణమన్నది అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదని 2008 మరో మారు కర్కశంగా నిరూపించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అణగారిన వర్గాలకు చెందిన ఒబామా గెలుపు మొట్టమొదటి సారిగా ఒక నల్ల జాతీయుడిని శ్వేతసౌధం లోకి పంపిన గొప్ప చరిత్రాత్మకమైన సంఘటనే అయినా, అమెరికా లోనూ, మొత్తం ప్రపంచమంతా వికసిస్తున్న ప్రజాస్వామిక ఆకాంక్షలకు చిహ్నమే అయినా, ఒబామా సామ్రాజ్యవాదుల ఆజ్ఞలకు భిన్నంగా మసలుకుంటాడనుకోవడం అత్యాశే! ఒకటి మాత్రం నిజం!! ప్రపంచ ప్రజలు ముఖ్యంగా అణగారిన ప్రజానీకం సామ్రాజ్యవాదంతో విసిగిపోయారు. దాని ధన, విస్తరణ, యుద్ధ దాహాలని ద్వేషిస్తున్నారు. ప్రజాస్వామిక ఆకాంక్షలకు, పోరాటాలకు ఊపిరిలూదుతున్నారు. వారి ఆకాంక్షలు సఫలీకృతం కావాలని ప్రాణహిత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది. వారి పోరాటాలకు మద్దతు తెలుపుతున్నది.
2008 మిగిల్చిన మరో విషాదం - తెలుగు సాహితీలోకంలో ప్రముఖులు సెలవంటూ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. మన కళ్ళముందే మన ముందు తరం వాళ్ళు తిరిగిరాని లోకాలకు నడిచి వెళ్ళి పోతుంటే గొప్ప దుఃఖం వెంటాడుతుంది. మానవీయతకు, ప్రజాస్వామిక ఆలొచనలకు తెలుగు సాహిత్యం లో ప్రతీకలుగా నిల్చిన వాళ్ళు హఠాత్తుగా ఒక ఉదయం మాయమైపోతే ఎడతెగని వెత గుండెకోతగా మిగుల్తుంది. మంచి కవి, రచయితా, మానవీయ ప్రజాస్వామిక విలువలను తన రచనలలో ప్రతిఫలించిన ఆదూరి సత్యవతీ దేవి మన మధ్యనుండి వెళ్ళిపోయారు. తను రాసిన కవిత ఒకదానిని ఈ సంచికలో ప్రచురిస్తున్నాము.
ఒక్క డిసెంబర్ నెలలోనే తెలుగు సాహిత్యంలో ఇద్దరు దిగ్గజాల్లాంటి వాళ్ళు స్మైల్ , జ్వాలాముఖి శాశ్వతంగా మనల్ని వీడి వెళ్ళిపోవడం ఒక గొప్ప విషాదం. ‘ఖాళీ సీసాలు’ కథా రచయితగా తెలుగు సాహిత్యం లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న స్మైల్ అద్భుతమైన కథల్ని, కవిత్వాన్ని తనదైన శైలిలో రాసారు. తన రచనల్లో నిరంతరం అణగారిన ప్రజానీకం కోసం తపించారు. ప్రజాస్వామిక ఆకాంక్షలను ప్రతిఫలించారు. పాత్రలు ‘సభ్య సమాజం’ ఈసడించుకుని ‘ప్రధాన స్రవంతి’ నుండి దూరంగా విసిరేయబడ్డ మురికివాడల స్త్రీలు ‘ఖాళీ సీసాలు’ కథ లో ప్రదాన పాత్రలు. వారి జీవితాల్లోని శోకమూ, అనుక్షణం వారనుభవించే కోతా, వారి మధ్య వైరుధ్యాలని అద్భుతంగా చిత్రించిన ‘ఖాళీ సీసాలు’ ఇప్పటిదాకా వచ్చిన గొప్ప తెలుగు కథల్లో ఒకటి. కవిత్వం రాసినా స్మైల్ తనదైన శైలిలో అతి తక్కువ మాటల్తో గొప్పగా కవిత చెప్పేవారు. రాసింది తక్కువే అయినా గొప్పగా చిరకాలం నిలిచి పోయేలా రాసిన వారు స్మైల్ . అనేక మంది ప్రపంచ కవులని తెలుగులోకి అనువదించిన స్మైల్ తెలుగు పాఠకులకు గొప్ప కవులెందరినో పరిచయం చేసారు. సున్నిత హృదయులూ, గొప్ప స్నేహశీలి, ప్రజాస్వామికవాది అయిన స్మైల్ మనందరి హృదయాల్లో, తెలుగు సాహిత్యంలో చిరకాలం నిలిచిపోతారు. ప్రాణహిత స్మైల్ కి నివాళి అర్పిస్తున్నది.

జ్వాలాముఖి
స్మైల్ వార్తనుండి తేరుకోక మునుపే మరో దుర్వార్త తెలుగు సాహితీ ప్రపంచాన్ని కుదిపేసింది. దిగంబర కవుల్లో ప్రముఖుడూ, విరసం సంస్థాపక సభ్యుల్లో ఒకరు అయిన జ్వాలాముఖి మరణం ఈ సంవత్సరాంతం మిగిల్చిన మరో గొప్ప విషాదం. గత కొంత కాలంగా ఉన్న జ్వాల గొంతులో మునుపటి ఉపన్యాస రౌద్రం లేకపోయినా జీవితం పట్ల గొప్ప ఆశ ధ్వనించింది. కానీ తనకొచ్చిన రుగ్మతతో చివరిదాకా పోరాడిన జ్వాల శాశ్వతంగా అస్తమించారు. దిగంబర కవిత్యోద్యమంతో తెలుగు సాహిత్యంలో పెను తుపానులా ప్రవేశించిన జ్వాలాముఖి రాసింది తక్కువే అయినా తన కంఠంలో అగ్ని పలికించారు. అణగారిన ప్రజల కోసం జీవితాంతం సడలని నిబద్దతతో నిలబడి వారి విముక్తి కోసం సాంస్కృతిక రంగంలో పోరాడిన యోధుడు జ్వాలాముఖి. గొప్ప నిజాయితీపరుడు, స్నేహశీలి, సహృదయుడు, అనుక్షణం మానవీయత కోసం, మానవ సంబంధాల్లో తడి కోసం తపించిన వ్యక్తి జ్వాలాముఖి. ‘ఈ భూగోళమ్మీద ఆకలి ఉన్నంతవరకూ మార్క్సిజాన్ని సవాలు చేసే దమ్ములెవరికీ లేవని’ మనసారా నమ్మిన జ్వాలాముఖి గొప్ప ఉపన్యాసకులు. తన ఉపన్యాసాల్లో జలపాతాలనీ, అగ్నిధారల్నీ ఉరికించిన జ్వాల 70-80 లలో ఆంధ్రదేశంలో వేల సంఖ్యల్లో విద్యార్థులని ప్రభావితం చేసారు. సాహితీ సాంస్కృతిక రంగాల్లో విప్లవ భావజాల వ్యాప్తికోసం అహర్నిశలూ కృషి చేసారు. జ్వాలాముఖి కవిత్వమే కాదు, అనేక కథలు రాసారు. అనేక అనువాదాలు చేసారు. మానవీయ సంబంధాల్లో సౌమ్యత, తడిని ప్రదర్శించిన జ్వాల, వ్యవస్థ పట్ల, అధికారంపట్ల, వ్యవస్థని కాపాడే ప్రభుత్వం పట్లా జీవితాంతం ద్వేషాన్ని ప్రకటించారు. జ్వాల మరణం ప్రగతిశీల, ప్రజాస్వామిక శక్తులకీ, మొత్తంగా తెలుగు సాహిత్యానికి గొప్ప వెలితి. ప్రాణహిత జ్వాలాముఖికి నివాళి అర్పిస్తున్నది.
ఇంతటితో ఆగదన్నట్టుగా 2008 ప్రజాస్వామిక సాహిత్యాభిమానులకు మరో దుర్వార్త నిచ్చింది. సాహిత్యంలో నోబెల్ బహుమతి గ్రహీత, ప్రఖ్యాత నాటక రచయిత హెరాల్డ్ పైంటర్ 8 ఏండ్లుగా కేన్సర్ తో బాధ పడుతూ 24 డిసెంబర్ 2008 నాడు కన్నుమూసారు. సామ్రాజ్యవాద యుద్ధ వ్యతిరేకి, ప్రజాస్వామిక వాది, శాంతి కాముకుడు, కార్యకర్త, నటుడూ, దర్శకుడూ అయిన పైంటర్ తన రచనల్లో సామాన్య మానవుల జీవన అస్తిత్వాన్ని, సంఘర్షణనూ, సాధారణంగా కనబడే జీవితాల్లోని సంక్లిష్టతనూ, సాంఘిక శక్తుల అణచివేతనూ, అసంబద్ధతనూ చాలా శక్తివంతంగా చిత్రించారు. తొలి రోజుల్లో రచనల్లో రాజకీయ అంశాలను, రాజకీయ రచనలను వ్యతిరేకించినా తర్వాత చాలా బలమైన రాజకీయ నాటకాలు రాసారు. వామపక్ష రాజకీయాలను బలంగా తన రచనల్లో పలికించారు. సామ్రాజ్యవాదానికి, యుద్ధానికి, ప్రభుత్వాల అప్రజాస్వామిక చర్యలకూ వ్యతిరేకంగా బలమైన గొంతుని విన్పించారు. నోబెల్ బహుమతిని స్వీకరించడానికి వ్యక్తిగతంగా స్టాక్ హోమ్ కి వెళ్ళడానికి ఆరోగ్యం సహకరించక తన ఉపన్యాసాన్ని వీడియో రికార్డ్ చేసి పంపారు. అందులో ఇరాక్ పై అమెరికా, బ్రిటన్ లు సాగిస్తున్న అధర్మ యుధ్ధాన్ని తీవ్ర స్వరంతో తెగనాడాడు. ‘ఇరాక్ పై యుద్ధం ఒక బందిపోటు చర్య. అన్ని అంతర్జాతీయ చట్టాలని తుంగలో తొక్కిన దుర్మార్గమైన రాజ్యపు టెర్రరిస్టు చర్య” అన్నారు పైంటర్ . ‘ఒక జన హంతకునిగా, యుద్ధ నేరస్తుడిగా పిలవబడాలంటే ఎంత మంది ప్రజలని చంపాలి? ఒక లక్షా? పది లక్షలా? “ అంటూ బుష్ ని , వంత పాడిన బ్లేర్ ని తీవ్రంగా విమర్శించాడు. పైంటర్ మరణం ప్రజాస్వామిక సాహిత్య అభిమానులకూ, యుద్ధ వ్యతిరేకులకూ తీరని లోటు.
కొన్ని సాంకేతిక కారణాల వల్ల డిసెంబర్ సంచికను తీసుకురాలేకపోయినందుకు మన్నించమని అడుగుతూ, మరిన్ని కథలూ, కవిత్వమూ, వ్యాసాలతో జనవరి 2009 సంచికను మీ ముందుకు తెస్తున్నాము. ఎప్పటిలాగే ప్రాణహితను ఆదరిస్తారని ఆశిస్తూ మరో సారి నూతన సంవత్సర శుభాకాంక్షలతో ….
- రేపటి కథ : ఆదూరి సత్యవతీ దేవి
- తొలి అడుగు : విన్నకోట రవిశంకర్
- సముద్రం పోయిందండి : స్వాతి శ్రీపాద
- విజయోల్లాసం : చల్లపల్లి స్వరూపరాణి
- పిచ్చి తల్లి : సలీం
- కుప్పం కాబ్లర్ : సీతారాం
- శబ్దం : దాట్లదేవదానం రాజు
- చివరి ప్రార్థన : కృపాకర్ మాదిగ
- మా తొవ్వ మేం నడుస్తం : సిద్దెంకి గిరి
- ఎడారి తుపాను : తైదల అంజయ్య
- అనుభవానికీ కథకీ నడుమ : శీలా సుభద్రా దేవి
- పూర్ణమ్మత్త జాబు : సుంకోజి దేవేంద్రాచారి
- ఐ విట్నెస్ : ఎన్.కె.రామారావు
- భక్తి లేదు-ముక్తి లేదు : ఆశా పూర్ణా దేవి | అనువాదం: స్వాతి శ్రీపాద
- ఈ ‘బొడ్డుపేగు’ తెగిపోదు : సి. కాశిం
- తెలంగాణ సంఘర్షణ పతాక “బలగం” : డా|| దార్ల వెంకటేశ్వరరావు
- ఒక రష్యన్ రాజ్వేరి గురించి : కాత్యాయని
- శీలా వీర్రాజు కథల్లో మనస్తత్వ చిత్రణ : ఆడెపు లక్ష్మీపతి
- చిన్నిచిన్నిపదాల సీనియర్కవి : డా|| బాణాల శ్రీనివాసరావు
- మాదిగ అస్తిత్వాల్ని గుర్తించని సాహిత్య రాజకీయాలు : జూపాక సుభద్ర
- నిరంతర సత్యాన్వేషి మహేంద్ర : కె.యన్.పలమనేరు బాలాజి
- నిశ్శబ్ద విప్లవం శీలా వీర్రాజు : జ్వాలాముఖి
- కొ.కు. వ్యాసం సమాజ నేత్రం : రామతీర్థ
- ఒఖడే: స్మైల్ కోసం : తమ్మినేని యదుకుల భూషణ్
- కొ.కు : రాచపాళెం చంద్రశేఖర రెడ్డి
- మెదడు, వార్థక్యం, మనోవికారాల ఫలితాలూ : డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
అభిప్రాయాలు లేవు »
